రాష్ట్రానికి త్వరలో కొత్త గవర్నర్?
సాక్షి, బెంగళూరు: రాష్ట్రానికి త్వరలో కొత్త రాజప్రతినిధి రాబోతున్నారా?, గవర్నర్ మార్పు తప్పదా అనే వార్తలు గుప్పుమంటున్నాయి. అనారోగ్యంతో బాధపడుతున్న కర్ణాటక రాష్ట్ర గవర్నర్ వజుభాయి రుడాభాయి వాలాకు విశ్రాంతి నిస్తారనే వార్తలు హాట్ టాపిక్‌గా మారాయి. ఆయన స్థానంలో కొత్త గవర్నర్‌ను నియమించే విషయమై కేంద్ర ప్రభుత్వం యోచన చేస్తున్నట్లు రాష్ట్ర రాజకీయాల్లో చక్కర్లు కొడుతున్నాయి. హృదయ సంబంధిత వ్యాధితో గత మూడు రోజులుగా నగరంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. ఆయనకు విశ్రాంతి అవసరమని అక్కడి వైద్యులు సూచించారు. 2014, నవంబర్ 1న కర్ణాటక గవర్నర్‌గా నియమితులైన వీఆర్ వాలా ఇటీవలే ఐదేళ్ల పదవీ కాలాన్ని పూర్తి చేసుకున్నారు. గవర్నర్‌గా సజావుగా బాధ్యతలు నిర్వర్తిస్తూ వచ్చారు. అనేక రాజకీయ సంక్షోభాల మధ్య కూడా వివాదాలకు చోటియ్యకుండా వ్యవహరించడం ఆయనకే చెల్లింది. బీజేపీ నాయకురాలు సుమిత్రా మహాజన్ తదుపరి గవర్నర్‌గా రావడానికి ఆసక్తి చూపుతున్నారు.
ప్రధానికి, హోంమంత్రికి చెప్పారా?
విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు ప్రస్తుతం అనారోగ్య పరిస్థితుల్లో గవర్నర్ పదవిని నిర్వహించడం వాలాకు కష్టంగా మారిందని ఆయనే స్వయంగా కేంద్రానికి విన్నవించినట్లు తెలిసింది. దీంతో రాష్ట్రానికి కొత్త గవర్నర్ అనివార్యంగా మారింది. కొన్నిరోజుల క్రితం ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాలను కలసిన ఆయన తన రాజీనామా విషయాన్ని ప్రస్తావించినట్లు తెలిసింది. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో కర్ణాటకకు తగిన గవర్నర్ లభించే వరకు కొన్నిరోజుల పాటు ఆ బాధ్యతలు చేపట్టాలని వాలాకు వారిరువురు సూచించినట్లు సమాచారం. అప్పటి నుంచి అయిష్టంగానే గవర్నర్ బాధ్యతల్ని నిర్వహిస్తున్నారు. ఇక ఇప్పుడు ఆయన ఆరోగ్యం కూడా సహకరించకపోవడంతో ఎప్పుడైనా కొత్త గవర్నర్ ప్రకటన వెలువడచ్చని రాజకీయ వర్గాల కథనం.